సిద్ధార్థ్ చేతిలోని సిగార్ సగం కాలిపోయింది. ఆ పెద్ద గదిలో నిశ్శబ్దం రాజ్యమేలుతోంది, కానీ అతని మనసులో మాత్రం ఒక తుఫాను చెలరేగుతోంది. నిన్న రాత్రి తన పక్కన పడుకున్న ఆ అమ్మాయి, మానస, ఇప్పుడు ఎక్కడ ఉందో తెలుసుకోవాలన్న కసి అతని అణువణువునా వ్యాపించింది. బెడ్ షీట్ మీద ఉన్న ఆ చిన్న రక్తపు మరకను చూసినప్పటి నుంచి అతనిలో ఏదో తెలియని అలజడి. ఎంతోమంది ఆడవాళ్లు తన జీవితంలోకి వచ్చారు, వెళ్లారు. కానీ ఏ ఒక్కరూ తనలో ఇంతటి ప్రభావాన్ని చూపించలేదు. డబ్బు కోసం వచ్చిన ఏ ఆడది తనను అలా అసహ్యించుకుంటూ, ఒక మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోదు. ఆమె కళ్లలో భయం ఉంది కానీ లొంగుబాటు లేదు. ఆమె ఏడుపులో బాధ ఉంది కానీ నటన లేదు. తనను ఒక రాక్షసుడిలా చూసిన ఆమె చూపులు అతన్ని ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. గది తలుపులు మెల్లగా తెరుచుకున్న శబ్దం కావడంతో సిద్ధార్థ్ ఆలోచనల నుంచి బయటకు వచ్చాడు. లోపలికి భయపడుతూనే అడుగుపెట్టాడు అతని పర్సనల్ అసిస్టెంట్ సంజయ్. సంజయ్ చేతిలో ఒక ఫైల్ ఉంది. సిద్ధార్థ్ కళ్లు ఆ ఫైల్ పైనే స్థిరపడ్డాయి. "సార్... మీరు అడిగిన డీటెయిల్స్ అన్నీ ఇందులో ఉన్నాయి. ఆ అమ్మాయి పేరు మానస..." అని సంజయ్ తడబడుతూ చెప్తుండగానే, సిద్ధార్థ్ వేగంగా ముందుకు వచ్చి ఆ ఫైల్ ని లాక్కున్నాడు. ఆ ఫైల్ తెరిచి చదువుతున్న సిద్ధార్థ్ ముఖంలో క్షణక్షణం రంగులు మారుతున్నాయి. కోపం, ఆశ్చర్యం, ఒక తెలియని బాధ... అన్నీ ఒకేసారి అతని ముఖంలో కనిపిస్తున్నాయి. "మానస, వయసు ఇరవై నాలుగు... ఒంటరి మహిళ... కుటుంబం ఎవరూ లేరు... ఒక అనాథలా బతుకుతోంది. ఆమెకు ఒక ఐదేళ్ల కొడుకు ఉన్నాడు. పేరు శివ..." ఈ లైన్ చదవగానే సిద్ధార్థ్ గుండె ఒక్కసారిగా ఆగినంత పనైంది. కొడుకా? ఐదేళ్ల కొడుకా? పెళ్లి కాకుండానే కొడుకు ఎలా వచ్చాడు? ఫైల్ ని ఇంకా వేగంగా తిరగేయడం మొదలుపెట్టాడు. "బాబుకి అత్యవసరమైన సెల్యులార్ థెరపీ సర్జరీ జరగాలి. గత కొన్ని వారాలుగా ఆస్పత్రి చుట్టూ తిరుగుతోంది. నిన్న సాయంత్రం డాక్టర్లు డెబ్భై ఐదు లక్షలు అరేంజ్ చేస్తేనే సర్జరీ చేస్తామని, లేకపోతే బాబు దక్కడని చెప్పారు. ఆమె తన దగ్గర ఉన్న చిన్న చిన్న వస్తువులన్నీ అమ్మేసినా పదివేలు కూడా రాలేదు. ఆస్పత్రి రికార్డ్స్ ప్రకారం కచ్చితంగా డెబ్భై ఐదు లక్షలు అవసరం..."
ఆ అంకె చూడగానే సిద్ధార్థ్ చేతిలోని ఫైల్ కింద పడిపోయింది. నిన్న రాత్రి ఆమె అన్న మాటలు అతని చెవుల్లో మార్మోగాయి. 'నాకు డెబ్భై ఐదు లక్షలు కావాలి... నా అవసరం నీ స్థాయికి మించినది.' ఆ మాటల వెనుక ఇంతటి గుండెకోత ఉందా? తన కన్న బిడ్డ ప్రాణాలను కాపాడుకోవడం కోసం, ఒక తల్లిగా తను గెలవడం కోసం, ఒక ఆడదిగా తను ఓడిపోవడానికి సిద్ధపడిందా? కనీసం ముఖం కూడా తెలియని ఒక రాక్షసుడి చేతిలో తన శరీరాన్ని నరకానికి అప్పగించిందా? సిద్ధార్థ్ కు తన మీద తనకే అసహ్యం వేసింది. తను ఎంత క్రూరంగా ప్రవర్తించాడు! ఆమె కన్నీళ్లు కారుస్తున్నా, నొప్పి భరించలేక మూలుగుతున్నా... కేవలం తను ఇచ్చిన డబ్బుకు ఆమె కొనుక్కోబడిన ఒక వస్తువు అనుకున్నాడు. ఒక జంతువులా ఆమె మీద పడి ఆమె శరీరాన్ని చిన్నాభిన్నం చేశాడు. ఆమె ఎలాంటిదో, ఆమె ఎందుకు వచ్చిందో అర్థం చేసుకునే ప్రయత్నం కనీసం ఒక్క క్షణం కూడా చేయలేదు. ఆమె కేవలం డబ్బు కోసం వచ్చిన ఒక మామూలు వేశ్య కాదు, బిడ్డ ప్రాణం కోసం తనను తాను అమ్ముకున్న ఒక నిస్సహాయురాలైన తల్లి. ఈ నిజం తెలిశాక సిద్ధార్థ్ గుండెల్లో ఒక వింతైన బాధ మొదలైంది. అదే సమయంలో ఆమె మీద ఎక్కడలేని ప్రేమ, ఒక బలమైన ఆకర్షణ పుట్టుకొచ్చాయి. ఆమె వేరే ఏ మగాడితోనూ పడుకోలేదు. కేవలం తన బిడ్డ కోసం తన దగ్గరకు వచ్చింది. ఆ నిజం అతనికి ఎంతో ఉపశమనాన్ని ఇచ్చింది. "ఆమె ఇప్పుడు ఎక్కడుంది సంజయ్?" అని గంభీరంగా అడిగాడు సిద్ధార్థ్. "సిటీ హాస్పిటల్ లో ఉంది సార్. ఉదయాన్నే వెళ్లి ఆ డెబ్భై ఐదు లక్షలు బిల్ కట్టేసింది. బాబుకి ఆపరేషన్ చేయడానికి డాక్టర్లు అన్నీ సిద్ధం చేస్తున్నారు," అని చెప్పాడు సంజయ్. సిద్ధార్థ్ కళ్లలో ఒక దృఢమైన నిశ్చయం కనిపించింది. ఆమెను ఎలాగైనా తన సొంతం చేసుకోవాలి. ఆ బిడ్డకు ప్రాణం పోసింది తనే కాబట్టి, ఇకపై ఆ తల్లి బిడ్డల బాధ్యత తనదే అని బలంగా అనుకున్నాడు. కానీ ఇది ఎలా చేయాలో అతనికింకా అర్థం కాలేదు. ముందు ఆ ఆపరేషన్ సక్సెస్ అవ్వాలి. ఆ తర్వాత ఆమెను తన ప్రపంచంలోకి ఎలా లాక్కొవచ్చాలో అతనికి తెలుసు.
ఇటు సిటీ హాస్పిటల్ లో మానస కళ్లు ఐసీయూలో ఉన్న శివ మీదే ఉన్నాయి. ఆమె కళ్లలో నీళ్లు ఆగకుండా కారుతున్నాయి. అకౌంట్ లో పడిన డెబ్భై ఐదు లక్షలు తీసుకెళ్లి కౌంటర్ లో కట్టగానే హాస్పిటల్ స్టాఫ్ అంతా ఆశ్చర్యపోయారు. నిన్నటి దాకా పదివేలు కట్టడానికి ఏడ్చిన ఆమెకు ఒకే రాత్రిలో డెబ్భై ఐదు లక్షలు ఎలా వచ్చాయని అందరూ గుసగుసలాడుకున్నారు. కానీ మానసకు అవన్నీ పట్టలేదు. తన కొడుకు ప్రాణం దక్కితే చాలు, ఈ ప్రపంచం తనను ఏమనుకున్నా పర్వాలేదు. డాక్టర్ బయటకు వచ్చి, "మానస గారు, డబ్బులు కట్టేశారు కదా, ఇంక మేము సెల్యులార్ థెరపీ సర్జరీ స్టార్ట్ చేస్తాం. మీరు భయపడకండి, బాబు తప్పకుండా కోలుకుంటాడు," అని చెప్పి లోపలికి వెళ్ళాడు. మానస అక్కడే ఉన్న ఒక కుర్చీలో కుప్పకూలిపోయింది. రాత్రి జరిగిన ఆ దారుణమైన సంఘటన ఇంకా ఆమెను వెంటాడుతూనే ఉంది. ఆ చీకటి గది, ఆ రాక్షసుడి స్పర్శ, ఒళ్లంతా ఉన్న గాయాలు... అన్నీ ఆమెను భయపెడుతున్నాయి. కానీ లోపల ఉన్న తన కొడుకును చూసుకున్నప్పుడల్లా ఆ నొప్పులన్నీ మర్చిపోతోంది. అయితే డాక్టర్ నిన్న అన్న మాటలు ఆమె మనసులో ఇంకా ఎక్కడో తొలిచివేస్తున్నాయి. "బోన్ మారో అయితే వంద శాతం సక్సెస్ అవుతుంది, కానీ తండ్రి కావాలి." తన కొడుకుకి ఏ కష్టం రాకూడదు. ఒకవేళ ఈ సర్జరీ తర్వాత మళ్లీ ఎప్పుడైనా సమస్య వస్తే? అప్పుడు కచ్చితంగా ఆ తండ్రి అవసరం వస్తే? అసలు ఆ తండ్రి ఎవరు? ఆరేళ్ల క్రితం ఆ చీకటి గదిలో తన జీవితాన్ని నాశనం చేసిన ఆ మృగం ఎవరు? ఈ ప్రశ్నలు ఆమెను ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు. ఎలాగైనా ఆ నిజం తెలుసుకోవాలి. తన కొడుకు భవిష్యత్తు కోసం ఆ రాక్షసుడిని కనుక్కోవాలి అని నిర్ణయించుకుంది.
ఆలోచనలన్నీ ఆరేళ్ల క్రితం జరిగిన గతం వైపు పరుగెత్తాయి. అప్పుడు మానస డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఒక అమాయకపు పల్లెటూరి అమ్మాయి. కాలేజీ ఫీజులు, హాస్టల్ ఖర్చుల కోసం సిటీలోని ఒక పెద్ద స్టార్ హోటల్ లో సాయంత్రం పూట పార్ట్ టైమ్ వెయిట్రెస్ గా పని చేసేది. ఒకరోజు రాత్రి, నవంబర్ నెలలో... ఒక విఐపి పార్టీ జరుగుతోంది. మానస డ్రింక్స్ సర్వ్ చేయడానికి ఒక ప్రైవేట్ స్యూట్ లోకి వెళ్ళింది. గదిలో లైట్లు లేవు, కేవలం ఒక చిన్న ల్యాంప్ వెలుగుతోంది. ఆమె టేబుల్ మీద డ్రింక్స్ పెడుతుండగా, వెనక నుంచి ఎవరో వచ్చి ఆమెను గట్టిగా పట్టుకున్నారు. ఆమె ఎంతు అరుస్తున్నా, ఎంత గింజుకుంటున్నా ఆ చేతులు ఆమెను వదల్లేదు. ఆ చీకట్లో అతని ముఖం ఆమెకు కనిపించలేదు, కనీసం అతని గొంతు కూడా వినపడలేదు. ఒక రాక్షసుడిలా అతను ఆమెను ఆ రాత్రి అనుభవించాడు. భయంతో, నొప్పితో సృహ కోల్పోయిన మానస, తెల్లవారుజామున మెలకువ రాగానే ఎవరూ చూడకముందే అక్కడినుంచి పారిపోయి వచ్చింది. ఆ భయంతో కనీసం పోలీసులకు కూడా కంప్లైంట్ చేయలేదు. మూడు నెలల తర్వాత తను ప్రెగ్నెంట్ అని తెలిసింది. ఇంట్లో వాళ్ళు ఆ గర్భాన్ని తీసేయమన్నారు, అవమానంతో చనిపోమన్నారు. కానీ తన కడుపులో పెరుగుతున్న ప్రాణాన్ని చంపుకోలేక ఇల్లు వదిలి సిటీకి వచ్చేసింది. కష్టపడి పని చేస్తూ, ఒంటరిగా శివను పెంచుకుంది. ఆ చీకటి గది, ఆ వాసన తప్ప ఆమెకు ఆ మగాడి గురించి ఏమీ తెలియదు. కానీ ఇప్పుడు తన కొడుకు కోసం ఆ హోటల్ కి వెళ్లాలి. ఆ రోజు రాత్రి ఆ స్యూట్ లో ఉన్నది ఎవరో తెలుసుకోవాలి అని గట్టిగా నిశ్చయించుకుంది మానస.
హాస్పిటల్ లో శివకు ఆపరేషన్ జరుగుతుండగానే, మానస ఎవరికీ చెప్పకుండా ఒక ఆటో పట్టుకుని ఆ స్టార్ హోటల్ దగ్గరికి చేరుకుంది. ఆరు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ హోటల్ గుమ్మం తొక్కడానికి ఆమె కాళ్లు వణుకుతున్నాయి. గుండె వేగంగా కొట్టుకుంటోంది. లోపలికి అడుగుపెట్టి నేరుగా రిసెప్షన్ దగ్గరికి వెళ్ళింది. అక్కడ ఉన్న మేనేజర్ ను చూసి, "సార్... నా పేరు మానస. ఆరు సంవత్సరాల క్రితం నేను ఇక్కడ పార్ట్ టైమ్ గా పని చేశాను. నాకు నవంబర్ నెలలో జరిగిన ఒక ప్రైవేట్ పార్టీకి సంబంధించిన డీటెయిల్స్ కావాలి... అప్పటి సీసీ ఫుటేజ్ ఏమైనా దొరుకుతుందా?" అని చాలా భయంగా, కంగారుగా అడిగింది. మేనేజర్ ఆమెను పైనుంచి కిందకు చూసి, "ఏంటి మేడమ్, ఆరేళ్ల క్రితం రికార్డ్స్ ఇప్పుడు అడుగుతున్నారు? అవన్నీ ఎప్పుడో డిలీట్ అయిపోయాయి. అయినా ఇక్కడ ప్రతి రోజూ వందల మంది వస్తుంటారు, మాకేం గుర్తుంటుంది? దయచేసి ఇక్కడినుంచి వెళ్ళండి, మా రెగ్యులర్ కస్టమర్స్ కి డిస్టర్బెన్స్ గా ఉంది," అని చాలా కఠినంగా చెప్పాడు. మానస కళ్ళలో నీళ్లు తిరిగాయి. "ప్లీజ్ సార్... ఇది నా కొడుకు ప్రాణానికి సంబంధించిన విషయం. నేను కాళ్ల మీద పడతాను సార్, దయచేసి పాత ఫైల్స్ ఏమైనా ఉంటే చూడండి," అంటూ ఏడుస్తూ ప్రాధేయపడుతోంది. ఆమె ఎంత బతిమాలుతున్నా మేనేజర్ మాత్రం కనికరించలేదు, పైగా సెక్యూరిటీని పిలిచి ఆమెను బయటకు పంపించడానికి ప్రయత్నించాడు.
సరిగ్గా అదే సమయానికి హోటల్ ఎంట్రన్స్ దగ్గర రెండు నల్లటి రేంజ్ రోవర్ కార్లు వచ్చి ఆగాయి. ముందు కారులోంచి బాడీగార్డ్స్ దిగి దారి క్లియర్ చేయగా, వెనక కారులోంచి దర్జాగా దిగాడు సిద్ధార్థ్. అతను ఆ హోటల్ లో జరిగే ఒక బిజినెస్ మీటింగ్ కోసం అక్కడికి వచ్చాడు. సిద్ధార్థ్ లోపలికి అడుగుపెట్టగానే హోటల్ స్టాఫ్ అంతా భయంతో వణికిపోతూ తలలు వంచుకుని నిలబడ్డారు. మేనేజర్ పరుగెత్తుకుంటూ వెళ్లి సిద్ధార్థ్ కి వంగి వంగి సలాం చేస్తున్నాడు. సిద్ధార్థ్ చూపులు మాత్రం రిసెప్షన్ కౌంటర్ దగ్గర ఏడుస్తూ నిలబడి ఉన్న మానస మీద పడ్డాయి. ఆమెను చూడగానే అతని అడుగులు ఆగిపోయాయి. 'నిన్న రాత్రి నా దగ్గరకు వచ్చిన ఈమె, డెబ్భై ఐదు లక్షలు తీసుకుని హాస్పిటల్ లో ఉండాల్సిన ఈమె, ఇక్కడికెందుకు వచ్చింది? ఇంత భయంతో ఇక్కడ ఎవరిని బతిమాలుతోంది?' సిద్ధార్థ్ మెదడులో వందల ప్రశ్నలు. అతను ఎవరికీ తెలియకుండా ఒక పక్కగా నిలబడి ఆమె మాటలు వినడం మొదలుపెట్టాడు. మానస ఇంకా ఏడుస్తూనే, "సార్ దయచేసి అర్థం చేసుకోండి, నాకు అప్పటి ఫుటేజ్ కావాలి. ఆ ప్రైవేట్ స్యూట్ లో ఆ రాత్రి ఎవరు ఉన్నారో నేను తెలుసుకోవాలి. నా కొడుకు తండ్రి ఎవరో తెలుసుకోవాల్సిన అవసరం నాకు ఉంది సార్," అని అడుగుతోంది. ఆ మాటలు వినగానే సిద్ధార్థ్ కు మైండ్ బ్లాక్ అయింది. 'కొడుకు తండ్రి ఎవరో తెలియదా? అంటే ఆమెకు పెళ్లి కాలేదా? ఆరేళ్ల క్రితం రికార్డ్స్ కోసం ఇక్కడ ఎందుకు అడుగుతోంది?' సిద్ధార్థ్ ఆలోచనలు పరుగులు పెడుతున్నాయి. ఆమె గురించి సంజయ్ ఇచ్చిన ఫైల్ లో, ఆమె సింగిల్ మదర్ అని, ఎవరితోనూ రిలేషన్ లో లేదని రాసి ఉంది. మరి ఈ కొడుకు తండ్రి ఎవరు? ఆరేళ్ల క్రితం ఈ హోటల్ లో ఆమెకు ఏం జరిగింది?
Comments