బయట భయంకరమైన గాలి వాన. ఆ చల్లటి గాలికి కిటికీ రెక్కలు కొట్టుకుంటున్నాయి. ఆ చీకటి గదిలో కిటికీల నుండి వస్తున్న చిన్న వెలుతురులో మూలన వణుకుతూ కూర్చుని ఉంది నిత్య. బయట నుండి ఎవరో గడియ పెట్టిన చప్పుడు. చీకటిలో తనను తాను హత్తుకుని గుండెలు పగిలేలా ఏడుస్తోంది. అప్పుడే బయట భారీ అడుగుల చప్పుడు వినిపించింది. తలుపు ఒక్కసారిగా దభేల్ మని బద్దలైనంత శబ్దంతో తెరుచుకుంది.
లోపలికి వచ్చిన ఆరడుగుల ఆకారం ఆమె వైపు కోపంగా అడుగులు వేస్తోంది.
భయంతో వెనక్కి జరుగుతూ, తన రెండు చేతులూ అడ్డుపెట్టుకుంటూ, వణుకుతున్న గొంతుతో ప్రాధేయపడింది.
బావా... ప్లీజ్ బావా... నక్కడే వదిలేయ్. నాకేం తెలియదు... ప్లీజ్ దగ్గరికి రాకు.
ఆమె మాటల్ని ఏమాత్రం పట్టించుకోకుండా, ఒక్క అడుగులో ఆమెను సమీపించి, ఆమె రెండు చేతులు గట్టిగా పట్టుకుని ఒక్కసారిగా తన వైపు లాక్కున్నాడు విక్రమ్.
కళ్లలో కోపం కట్టలు తెంచుకుంటుండగా, పళ్ళు కొరుకుతూ గద్దించాడు.
ఎందుకు వదిలేయాలి నిత్యా? నా దగ్గర నుండి తప్పించుకుని ఎక్కడికి వెళదామని? నన్ను వదిలేసి ఇంకెవరి దగ్గరికో పారిపోదామనుకున్నావా?
ఆమె కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతున్నాయి. పట్టుకున్న చేతులు విడిపించుకోవడానికి సర్వశక్తులూ ఒడ్డుతూ, ఏడుస్తూ కేకలు వేసింది.
బావా... నువ్వు మనిషివి కాదు రాక్షసుడివి! నన్ను వదిలేయ్... నేను ఇక్కడ ఉండలేను. ఈ నరకం నేను భరించలేను. దయచేసి నన్ను చంపేయ్ బావా ప్లీజ్.
విక్రమ్ ఆమెను రెండు చేతులతో గట్టిగా గోడకు అదిమిపట్టి, ఆమె ముఖం మీద పడుతున్న జుట్టును వెనక్కి లాగుతూ, చెవి దగ్గరగా వంగి కసిగా అన్నాడు.
అవును, రాక్షసుడినే! నన్ను ఇలా మార్చింది నువ్వే. నీకు దేవుడు కావాలా? వాడు ఎక్కడో ఉన్నాడు. కానీ ఈ రాక్షసుడికి మాత్రం నువ్వు సొంతం. నువ్వు నా దానివి... నీ ప్రాణం పోయినా ఈ గది దాటి బయటికి వెళ్లలేవు. ఈ జన్మకి ఇదే నీ ప్రపంచం, ఈ రాక్షసుడే నీ మొగుడు!
ఆమె ఏడుపు ఆ గదిలో ప్రతిధ్వనిస్తోంది. ఆ చీకటిలో ఆ రాత్రి ఆమె పడబోయే నరకానికి అది ఆరంభం మాత్రమే.
కొన్ని గంటల క్రితం ఉదయం పది గంటలు
ఆడంబరంగా ముస్తాబైన పెళ్లి మండపం. ఎక్కడ చూసినా పూల అలంకరణలు, మంగళవాయిద్యాలు.
పెళ్లి పీటల మీద నిత్య ఎంతో అందంగా కూర్చుని ఉంది. పట్టుచీర, ఒళ్లంతా నగలతో దేవతలా ఉంది. పక్కన పెళ్లి కొడుకు ఏదో జోక్ వేస్తే నిత్య పైకి నవ్వుతూ కనిపించింది. కానీ ఆ నవ్వులో ప్రాణం లేదు.
దూరంగా ఒక స్తంభం చాటున నిలబడి ఆ దృశ్యాన్ని చూస్తున్న విక్రమ్ కళ్ళు అగ్నిగుండంలా మండుతున్నాయి. చేతిలో ఉన్న జ్యూస్ గ్లాసును ఎంత గట్టిగా పట్టుకున్నాడంటే, ఆ గాజు పగిలి చేతికి రక్తం వస్తుందేమో అన్నంత కోపంగా ఉన్నాడు.
అక్కడికి వచ్చిన విక్రమ్ ఫ్రెండ్ రాహుల్, వాడి భుజం మీద చెయ్యేస్తూ, విక్రమ్ చూపుల్ని గమనించి నిట్టూర్చాడు.
ఏంట్రా అలా చూస్తున్నావ్? పిచ్చోడిలా బిహేవ్ చేయకు. నీ మరదలు పెళ్లి సంతోషంగా జరుగుతోంది. వెళ్లి ఆశీర్వదించు లేదా సైలెంట్ గా ఇక్కడినుంచి పద.
విక్రమ్ కోపంగా వాడి వైపు తిరిగి, చేతిలో ఉన్న గ్లాసును బల్ల మీద విసిరికొడుతూ పళ్లు కొరికాడు.
సంతోషంగా జరుగుతోందా? డబ్బు కోసం కక్కుర్తి పడి నా మరదలిని ఆడికి ఇచ్చి చేస్తున్నాడు ఆ రామ్మూర్తి. ఆ పీటల మీద ఉండాల్సింది రాహుల్ నేను! చిన్నప్పటి నుంచి నా ప్రాణం తను. నా కోసం పుట్టింది రా తను.
రాహుల్ వాడిని శాంతింపజేయడానికి ప్రయత్నిస్తూ భుజం తట్టాడు.
అరేయ్ విక్రమ్, గతం వదిలేయ్ రా. మీ మావయ్య మిమ్మల్ని అవమానించిన మాటలు మర్చిపో. అయినా నీ దగ్గర ఇప్పుడు వేల కోట్లు ఉన్నాయని, నువ్వు ఇంత పెద్ద బిజినెస్ మ్యాన్ అని వాళ్ళకి తెలియదు కదరా, అందుకే వాళ్ళకి సంబంధం కలుపుకోవట్లేదేమో.
విక్రమ్ కళ్ళు ఎర్రబడ్డాయి. గొంతులో పగ స్పష్టంగా తెలుస్తోంది.
తెలియకపోవడం ఏంటి రాహుల్? నా దగ్గర వందల కోట్లు ఉన్నాయని, నేను బాగానే స్థిరపడ్డానని వాళ్ళకి తెలుసు. కానీ వాళ్ళ ఈగో హర్ట్ అయ్యింది. మా మామయ్యకి ఎంత పొగరు అంటే అంత పొగరు. ఒకప్పుడు తన ఇంటి ముందు నిలబెట్టి గెంటేసిన వాడు, ఇప్పుడు తనకంటే పైస్థాయిలో ఉన్నాడని తట్టుకోలేకపోతున్నాడు. తనకంటే తక్కువ స్థాయి వాడు ఇప్పుడు తనకి అన్నం పెట్టే స్టేజ్ కి వచ్చాడని అతని అహంకారం అడ్డుపడుతోంది. ఆ అహంకారాన్ని ఈరోజు నేను ఎలా అణగదొక్కుతానో చూడు.
మళ్లీ పెళ్లి పీటల వైపు చూశాడు విక్రమ్. పెళ్లి కొడుకు పక్కన నిత్య నవ్వుతూ కూర్చోవడం చూసి అతనిలో కోపం కట్టలు తెంచుకుంది.
డబ్బు కోసం వాడి పక్కన నవ్వుతూ కూర్చున్నావా నిత్యా? నీకు నేను గుర్తుకు రాలేదా? చిన్నప్పుడు నాతోనే ఉంటాను అని చెప్పిన దానివి, ఇప్పుడు వాడి డబ్బు చూసి ఇంతగా దిగజారిపోయావా? నిన్ను, మీ నాన్న అహంకారాన్ని రెండు నేలమట్టం చేస్తాను.
అప్పుడే మండపంలో పెద్ద గొడవ మొదలైంది. మంత్రాలు చదువుతున్న పంతులు గారు ఆగిపోయారు. పెళ్లి కొడుకు తండ్రి సుబ్బారావు ఒక్కసారిగా లేచి నిలబడి, గట్టిగా అరుస్తూ ముందుకు వచ్చాడు.
చేతులు ఊపుతూ, గొంతు చించుకుని అరిచాడు సుబ్బారావు.
ఆపండిరా ఈ పెళ్లి! మంత్రాలు ఆపండి. ఒక్క ముడి కూడా పడటానికి వీల్లేదు.
అందరూ షాక్ అయ్యారు. పీటల మీద ఉన్న నిత్య ఉలిక్కిపడి తల పైకి ఎత్తి చూసింది. కానీ ఆమె కళ్ళలో కన్నీళ్లు లేవు. ఏడవాలో, నవ్వాలో తెలియని ఒక వింతైన స్తబ్ధత ఆమె ముఖంలో ఆవహించింది. అసలు తన జీవితంలో ఏం జరుగుతోంది అన్నది ఏమీ అర్థం కానట్టుగా, ఒక బొమ్మలాగా పీటల మీద అలాగే కూర్చుని తన తండ్రి వైపు చూస్తూ ఉండిపోయింది.
రామ్మూర్తి కంగారుగా పరిగెత్తుకుంటూ వెళ్లి, సుబ్బారావు రెండు చేతులు పట్టుకున్నాడు.
ఏమైంది వియ్యంకుగారు? పెళ్లి ఆపమంటున్నారు? ముహూర్తానికి టైం అవుతోంది. దయచేసి కూర్చోండి.
సుబ్బారావు రామ్మూర్తి చేతుల్ని విసిరికొట్టి, అసహ్యంగా చూస్తూ అరిచాడు.
ఏం నటించావయ్యా రామ్మూర్తి? పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అని కలరింగ్ ఇచ్చావు. నాకు ఇస్తానన్న ఆ పది ఎకరాల ల్యాండ్ పేపర్లు ఇంకా ఎందుకు ఇవ్వలేదో నాకు ఇప్పుడే తెలిసింది. నీ కంపెనీ లాస్ లో ఉందని, పీకల్లోతు అప్పుల్లో మునిగిపోయావని నాకిప్పుడే నా మనుషులు ఫోన్ చేసి చెప్పారు. నీ దరిద్రాన్ని నా కొడుకు నెత్తిన రుద్దుదామనుకున్నావా?
రామ్మూర్తి గుండె ఆగినంత పనైంది. పరువు పోతోందన్న భయంతో చేతులు కట్టుకుని వణుకుతున్న గొంతుతో వేడుకున్నాడు.
అలా అనకండి బాబుగారు. నా కూతురు పీటల మీద ఉంది. పది మందిలో పరువు పోతుంది. మీకు ఆ ఆస్తి నేను ఎలాగైనా రాసిచ్చేస్తాను. కావాలంటే నా ఉన్న ఆస్తి మొత్తం మీ పేరు మీద రాస్తాను. దయచేసి పెళ్లి జరిపించండి.
సుబ్బారావు ఏమాత్రం కరుణ లేకుండా నవ్వుతూ అన్నాడు.
నీ పరువు పోతే నాకేంటయ్యా? నా కొడుక్కి ఇంతకంటే గొప్ప సంబంధం వస్తుంది, బోలెడు కట్నం వస్తుంది. అప్పుల్లో ఉన్న నీ కూతురు మాకు వద్దు. పదరా నాన్నా వెళ్దాం.
తన కొడుకుని చెయ్యి పట్టుకుని లాగాడు.
ఇదంతా చూస్తున్న లక్ష్మి పరిగెత్తుకుంటూ వచ్చి సుబ్బారావు కాళ్ల మీద పడిపోయి భోరున ఏడ్చింది.
అయ్యా, అలా చేయకండి. ఆడపిల్ల పెళ్లి పీటల మీద ఆగిపోతే అది బతకదు. నా కూతురి జీవితం నాశనం చేయకండి. మీకు రెండు చేతులూ జోడించి దండం పెడతాను. నా బిడ్డకు అన్యాయం చేయకండి.
సుబ్బారావు ఆమెను కాలితో పక్కకు నెట్టి, కఠినంగా అన్నాడు.
వదలవే! మీ దరిద్రం మాకు అంటించకండి. పదా రా.
పెళ్లి కొడుకు వాళ్ళు మండపం దిగి వెళ్లిపోయారు. మండపం అంతా నిశ్శబ్దం. గుసగుసలు మొదలయ్యాయి. నిత్య పీటల మీద ఏమీ అర్థం కానట్టుగా, తన తండ్రి పడుతున్న అవమానాన్ని చూస్తూ అలా స్తబ్ధురాలై కూర్చుని ఉండిపోయింది.
రామ్మూర్తి తల పట్టుకుని కింద కూర్చుండిపోయాడు. ఇదంతా చూస్తున్న విక్రమ్ పెదాలపై ఒక క్రూరమైన చిరునవ్వు కనిపించింది. తన మామయ్య అహంకారం ఈరోజుతో మట్టిలో కలిసిపోయిందని సంబరపడ్డాడు.
రామ్మూర్తి కన్నీళ్లతో చుట్టూ చూశాడు. ఎవరూ సాయం చేసేలా లేరు. అప్పుడే దూరంగా నిలబడి ఉన్న తన అక్క భవాని కనిపించింది. పదేళ్ల క్రితం తను గెంటేసిన ఆ ఇల్లే ఇప్పుడు తన కూతురికి దిక్కు అనిపించింది. వెంటనే ఆమె దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లి, భవాని కాళ్ల మీద పడిపోయాడు రామ్మూర్తి.
కన్నీళ్లు కారుస్తూ, రెండు చేతులూ జోడించి బతిమాలాడు.
అక్కా... నన్ను క్షమించు అక్కా. 10 సంవత్సరాల క్రితం బావగారు చనిపోతే నువ్వు దిక్కులేక నా దగ్గరికి వచ్చినప్పుడు నిన్ను అనుమానించాను. నా అహంకారంతో నిన్ను, నీ కొడుకుని నా ఇంటి గేటు బయట నిలబెట్టి అవమానించాను. నేను చేసిన పాపం నన్ను ఈరోజు ఇలా రోడ్డున పడేసింది. నా తప్పు నేను తెలుసుకున్నాను. కన్న రక్తానికే కాదన్నాను. ప్లీజ్ అక్కా నా మీద కొంచెం కనికరించు. పీటల మీద పెళ్లి ఆగింది, నా కూతురి పరువు పోయింది. నా అల్లుడితో ఒక మాట మాట్లాడు అక్కా. నీ కాళ్ళు పట్టుకుంటాను, దయచేసి నా కూతురి మెడలో తాళి కట్టమని అల్లుడికి చెప్పు అక్కా.
భవాని మనసు కరిగిపోయింది. కన్న తమ్ముడు అలా ఏడుస్తూ కాళ్ళ మీద పడేసరికి ఆమెలోని కోపం అంతా మాయమైపోయింది. తన సొంత తమ్ముడి బాధ ఆమె చూడలేకపోయింది.
కన్నీళ్లు తుడుచుకుంటూ తమ్ముడిని పైకి లేపుతూ అంది భవాని.
సరే తమ్ముడు, నేను మాట్లాడతాను నువ్వు ఏడవకు. నువ్వు నా తమ్ముడివి రా, నీ కష్టం చూస్తూ నేను ఎలా ఊరుకుంటాను? ఏమైందో ఏమో అంతా మన మంచికే జరిగింది. నేను వాడితో మాట్లాడి ఒప్పిస్తాను నువ్వు కంగారు పడకు.
భవాని నెమ్మదిగా నడుచుకుంటూ దూరంగా నిలబడి ఉన్న విక్రమ్ దగ్గరికి వెళ్లింది.
కొడుకు భుజం మీద చెయ్యేసి, కళ్ళమ్మట నీళ్లు తిరుగుతుండగా ప్రాధేయపడింది.
ఒరేయ్ విక్రమ్... చూశావు కదా ఏం జరిగిందో. పీటల మీద పెళ్లి ఆగిపోయింది రా. వాడి అహంకారం అణిగిపోయి నా కాళ్ళ మీద పడ్డాడు. ఆ పిల్ల ఏం పాపం చేసింది? ఈ గొడవల్లో ఆ పిల్లకు ఏం సంబంధం? నా మాట విని నువ్వు వెళ్లి ఆ పిల్లకు తాళి కట్టురా.
విక్రమ్ తల్లి చేతులు విడిపించుకుంటూ, కోపంగా పెదవి కొరికాడు.
ఏంటమ్మా నువ్వు మాట్లాడుతున్నావ్? వాళ్లు మనల్ని ఎంత అవమానించారో మర్చిపోయావా? ఇప్పుడు వాళ్ల కంపెనీ లాస్ లో ఉందని, అప్పుల పాలయ్యారని, పెళ్లి ఆగిపోయిందని దిక్కులేక నా దగ్గరికి వస్తున్నారా? నా డబ్బు కోసం ఆ పిల్ల ఎవరి పక్కనైనా కూర్చుంటుంది. నిన్నేమో వాడు, ఈరోజు నేను. నేను ఆ పిల్లను చేసుకోను.
భవాని వాడి రెండు చేతులూ గట్టిగా పట్టుకుని, కన్నీళ్లతో బతిమాలింది.
ఒరేయ్, వాళ్లు చేసింది తప్పే. కానీ ఆ పిల్ల అమాయకురాలు రా. చిన్నప్పటి నుంచి నీతోనే తిరిగింది కదా. నీకు ఆ పిల్లంటే ప్రాణం కదా. నా మీద ఒట్టు రా... వెళ్లి తాళి కట్టు.
తల్లి కన్నీళ్లు చూసి విక్రమ్ కరిగిపోయాడు, కానీ అతని మనసులో రామ్మూర్తి మీద, నిత్య మీద ఉన్న పగ చావలేదు. నిత్య డబ్బు కోసమే తనని పెళ్లి చేసుకుంటోందని అతని నమ్మకం. సరే, చేసుకుంటాను. కానీ నా ప్రేమ కోసం కాదు... నన్ను కాదని వేరే వాడి కోసం పీటలెక్కినందుకు, నా మీద కాకుండా నా డబ్బు మీద ఆశ పడినందుకు... నీకు, నీ కూతురికి నరకం అంటే ఏంటో చూపిస్తాను అనుకుంటూ పీటల వైపు అడుగులు వేశాడు విక్రమ్.
నిత్య తల దించుకుని కన్నీళ్లు కారుస్తూనే ఉంది. విక్రమ్ వచ్చి తన పక్కన కూర్చోగానే ఉలిక్కిపడి అతని వైపు చూసింది. విక్రమ్ కళ్లలో ఉన్న భయంకరమైన కోపం, పగ చూసి ఆమె గుండెల్లో దడ మొదలైంది. ఇదివరకు తను చూసిన బావ కళ్ళు కాదు అవి.
పంతులు గారు తాళి విక్రమ్ చేతికి ఇచ్చారు. విక్రమ్ ఆ తాళిని నిత్య మెడ దగ్గరికి తీసుకువెళ్లాడు. నిత్య కళ్ళలోకి చూస్తూ కసిగా ఆ మూడు ముళ్లు వేశాడు. ఆ తాళి మీద నిత్య కన్నీళ్లు రాలాయి. కానీ ఆ ముళ్లు ప్రేమతో పడినవి కావు, పగతో పడినవి.
పెళ్లి తంతు ముగిసింది. అప్పగింతల కార్యక్రమం.
రామ్మూర్తి విక్రమ్ రెండు చేతులు పట్టుకుని ఏడుస్తూ బతిమాలాడు.
అల్లుడు గారూ... నా కూతుర్ని మహారాణిలా చూసుకో బాబు. నా తప్పుల్ని క్షమించు. నేను ఎంత అహంకారంగా ప్రవర్తించినా, ఈరోజు నా పరువు నిలబెట్టావు. నా కూతురికి జీవితం ఇచ్చావు. నువ్వు చల్లగా ఉండాలి అల్లుడు.
విక్రమ్ పైకి నవ్వుతూనే, రామ్మూర్తి చేతులు పట్టుకుని ఎంతో ఆప్యాయంగా మాట్లాడుతున్నట్టు నటిస్తూ అన్నాడు.
మావయ్య, మీరు కంగారు పడకండి. నేనున్నాను కదా. ఏది ఏమైనా మీరు నా సొంత మావయ్య. మన మధ్య గొడవలున్నా ఇప్పుడు నేను మీ అల్లుడిని కదా. మీ కూతురి సంగతి నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. మీరు నిశ్చింతగా ఉండండి మావయ్యా. నేను చూసుకుంటాను తనని.
రామ్మూర్తి సంతోషంతో ఉప్పొంగిపోయాడు. తన అల్లుడు ఎంత మంచోడో అనుకున్నాడు. కానీ విక్రమ్ మాటల్లోని వెటకారం, కోపం నిత్యకు స్పష్టంగా అర్థమైంది.
అందరూ వీడ్కోలు చెబుతుండగా భవాని విక్రమ్ దగ్గరికి వచ్చింది.
కొడుకు భుజం నిమురుతూ ఎంతో ఆప్యాయంగా అంది భవాని.
ఒరేయ్ విక్రమ్, మీరు ఇద్దరూ కార్లో బయలుదేరండి నాన్నా. నేను వెనుక వేరే కార్లో వస్తాను. మీరిద్దరూ జాగ్రత్తగా వెళ్ళండి.
Comments