అప్పుడే గది తలుపు తెరుచుకుని ఇద్దరు పనివాళ్లు లోపలికి వచ్చారు. వాళ్ల చేతుల్లో ఒక పెద్ద సిల్వర్ ట్రే ఉంది. అందులో రకరకాల పండ్లు, వేడి వేడి అల్పాహారం, పాలు ఉన్నాయి. వాళ్లు చాలా మర్యాదగా ఆ ట్రేని అక్కడున్న టీపాయ్ మీద పెట్టారు.
"మేడమ్... బాస్ మీకు బ్రేక్ ఫాస్ట్ తీసుకువెళ్లమని చెప్పారు. దయచేసి తినండి," అని ఒక పనిమనిషి వినయంగా చెప్పింది.
అరుణ వాళ్ల వైపు కోపంగా, అసహ్యంగా చూసింది. "నాకేమీ వద్దు! దీన్ని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళండి. నాకు ఆకలిగా లేదు. నన్ను ఒంటరిగా వదిలేయండి!" అని అరిచింది.
పనివాళ్లు భయపడిపోయారు. "మేడమ్... మీరు తినకపోతే బాస్ మమ్మల్ని చంపేస్తారు. దయచేసి ఒక్క ముద్దయినా తినండి," అని బతిమాలుకున్నారు.
కానీ అరుణ ససేమిరా అంది. "నేను చచ్చిపోయినా పర్వాలేదు, ఆ రాక్షసుడు పెట్టే తిండి నేను తినను. తీసుకుపోండి ఇక్కడి నుంచి!" అని ట్రేని పక్కకు నెట్టేసింది. అందులో ఉన్న ఒక పండ్ల రసం గ్లాసు కిందపడి పగిలిపోయింది. పనివాళ్లు భయంతో వణుకుతూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.
మరో అరగంట గడిచింది. గది తలుపులు హఠాత్తుగా, చాలా బలంగా తెరుచుకున్నాయి.
అది రాజ్వీర్. అతను బ్లాక్ షర్ట్, డార్క్ జీన్స్ వేసుకుని ఉన్నాడు. అతని ముఖంలో భయంకరమైన కోపం కనిపిస్తోంది. అతని అడుగుల చప్పుడుకే అరుణ గుండె వేగం పెరిగింది. భయంతో వెనక్కి జరిగి గోడకు ఆనుకుంది. రాజ్వీర్ నేరుగా ఆమె దగ్గరికి వచ్చాడు. కింద పగిలి ఉన్న గ్లాసు ముక్కలను చూశాడు.
"తిననని మొండికేస్తున్నావట? నీకు అంత పొగరా?" అని గర్జించాడు రాజ్వీర్.
అరుణ కన్నీళ్లతో వణుకుతూనే, కాస్త ధైర్యం తెచ్చుకుని, "అవును తినను! నన్ను బంధించి, నా జీవితాన్ని నాశనం చేసి, ఇప్పుడు ప్రేమగా భోజనం పెడుతున్నావా? నీ లాంటి రాక్షసుడి ఇంట్లో మంచి నీళ్లు కూడా తాగను. నన్ను చంపేయ్... అదే నాకు ప్రశాంతత!" అని ఏడుస్తూ అరిచింది.
రాజ్వీర్ కళ్ళలో కోపం కట్టలు తెంచుకుంది. కానీ అతను ఆమెను కొట్టలేదు. తన కోపాన్ని అదుపు చేసుకుంటూ, టీపాయ్ మీద ఉన్న ట్రే దగ్గరికి వెళ్ళాడు. అందులో ఉన్న ఒక ప్లేట్ తీసుకుని మళ్ళీ అరుణ దగ్గరికి వచ్చి మోకాళ్ల మీద కూర్చున్నాడు. అతని చేతిలో ఆహారం ఉంది.
"నోరు తెరువు," అని చాలా కఠినంగా అన్నాడు.
అరుణ తల అడ్డంగా ఊపింది. పెదవులను గట్టిగా బిగించింది.
రాజ్వీర్ ఒక చేత్తో ఆమె రెండు చేతులను పట్టుకుని వెనక్కి లాక్ చేశాడు. మరో చేత్తో ఆమె దవడను గట్టిగా నొక్కాడు. ఆ నొప్పికి ఆమె 'ఆహ్' అంటూ నోరు తెరిచింది. వెంటనే తన చేతిలోని అన్నం ముద్దను ఆమె నోట్లో కుక్కాడు.
"మింగు!" అని శాసించాడు.
అరుణ కన్నీళ్లు కార్చుకుంటూనే, ఆ బాధను భరిస్తూ, అతను పెట్టిన ముద్దను మింగింది. అతను అలాగే బలవంతంగా, చాలా కఠినంగా ఆమెకు భోజనం మొత్తం తినిపించాడు. ఆమె ఏడుస్తూనే తింటోంది. అతను తినిపించే విధానంలో విపరీతమైన ఫోర్స్ ఉంది, కానీ అదే సమయంలో ఆమె ఏమీ తినకుండా పస్తులుండకూడదు అన్న ఒక వింతైన పట్టింపు కూడా అందులో కనిపించింది.
తినిపించడం పూర్తయ్యాక, ఆమె దవడను వదిలేసి, ఒక టిష్యూతో ఆమె నోరు తుడిచాడు. "నాకు కోపం తెప్పించాలని చూడకు అరుణ. నువ్వు ఈ ఇంట్లో బతకాలంటే నా మాట వినాల్సిందే. చచ్చిపోవాలన్న పిచ్చి ఆలోచనలు నీ బుర్రలోకి వస్తే... నీ కుటుంబం మొత్తం నాశనమైపోతుంది. గుర్తుపెట్టుకో!" అని వార్నింగ్ ఇచ్చి, లేచి నిలబడి గదిలోంచి వెళ్లిపోయాడు.
ఇటువైపు పోలీస్ స్టేషన్లో రాఘవ, కార్తీక్ కన్నీళ్లు పెట్టుకుంటూ ఎస్సై టేబుల్ ముందు నిలబడి ఉన్నారు.
రాఘవ చేతులు జోడించి కన్నీళ్లు తుడుచుకుంటూ, "సార్... మా పాప నిన్న సాయంత్రం గుడికి వెళ్లింది. మళ్ళీ తిరిగి రాలేదు. రాత్రంతా ఊరంతా వెతికాము. ఎవరైనా నా బిడ్డను కిడ్నాప్ చేశారేమో అని భయంగా ఉంది సార్. దయచేసి మా అమ్మాయిని వెతికి పెట్టండి," అని రోదించాడు.
ఎస్సై కంప్లైంట్ తీసుకుని నిర్లక్ష్యంగా చూస్తూ, "కంగారు పడకండి పెద్దాయన. అమ్మాయి ఫోటో, వివరాలు ఇవ్వండి. మేము దర్యాప్తు మొదలుపెడతాము. ఇంతకీ ఆ పిల్లకి ఎవడితోనైనా ప్రేమ గీమ వ్యవహారాలు ఉన్నాయా? కుర్రాడితో లేచిపోయిందేమో?" అని అడిగాడు.
ఆ మాటకి కార్తీక్ కి కోపం వచ్చింది. "ఏం మాట్లాడుతున్నారు సార్? నా చెల్లి అలాంటిది కాదు. తను చాలా సైలెంట్. తన పని తను చూసుకుంటుంది. అనవసరంగా మా చెల్లి క్యారెక్టర్ గురించి మాట్లాడకండి," అన్నాడు కోపంగా.
"సరే సరే ఆవేశపడకు. ముందు ఈ ఎఫ్.ఐ.ఆర్ మీద సంతకం చేయండి. నేను వెంటనే మా కానిస్టేబుల్స్ ని పంపి గుడి చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయిస్తాను. అందులో ఏముందో చూద్దాం," అన్నాడు ఎస్సై.
ఈ విషయం వెంటనే రాజ్వీర్ అసిస్టెంట్ విక్రమ్ కి తెలిసింది. విక్రమ్ పరుగు పరుగున రాజ్వీర్ స్టడీ రూమ్ లోకి వెళ్ళాడు.
"బాస్... ప్రాబ్లం వచ్చింది. అరుణ వాళ్ళ నాన్న పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాడు. పోలీసులు కిడ్నాప్ కేసు ఫైల్ చేశారు. సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తున్నారు. అందులో మన కార్ కనిపిస్తే ప్రమాదం," అని కంగారుగా చెప్పాడు విక్రమ్.
రాజ్వీర్ సోఫాలో కాలు మీద కాలు వేసుకుని, చేతిలో ఉన్న విస్కీ గ్లాస్ ని నెమ్మదిగా సిప్ చేస్తూ, చాలా ప్రశాంతంగా విక్రమ్ వైపు చూశాడు. అతని కళ్ళలో ఎలాంటి భయం లేదు. ఒక చిరునవ్వు మాత్రమే ఉంది.
"విక్రమ్... నా సామ్రాజ్యంలో పోలీసులు నన్ను టచ్ చేయగలరని నువ్వు అనుకుంటున్నావా?" అని వ్యంగ్యంగా నవ్వాడు రాజ్వీర్. "వెంటనే ఆ ఏరియా డీఎస్పీకి ఫోన్ కలుపు. ఆ కేసు ఫైల్ ని క్లోజ్ చేయమను. సీసీటీవీ ఫుటేజ్ మొత్తం డిలీట్ అయిపోవాలి. ఆ ముసలాయనకి, వాళ్ళ కొడుక్కి ఏమీ తెలియకూడదు. వాళ్ళు వెతుక్కుంటూనే ఉండాలి, కానీ వాళ్లకి ఎలాంటి సమాచారం దొరకకూడదు. అర్థమైందా?" అని ఆర్డర్ వేశాడు.
"ఎస్ బాస్," అని చెప్పి విక్రమ్ వెంటనే డీఎస్పీకి ఫోన్ చేశాడు. పది నిమిషాల్లో పోలీస్ స్టేషన్లో పరిస్థితి మారిపోయింది. పై అధికారుల నుంచి వచ్చిన ప్రెజర్ తో ఆ ఎస్సై కేసుని పక్కన పెట్టేశాడు. సీసీటీవీ ఫుటేజ్ మొత్తం మాయమైపోయింది. రాఘవ, కార్తీక్ లు దిక్కుతోచని స్థితిలో పోలీస్ స్టేషన్ బయట నిలబడి ఏడుస్తూ ఉండిపోయారు.
వంద ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఆ పాతకాలపు జమీందార్ బంగ్లా చూడటానికి చాలా గంభీరంగా ఉంటుంది. ఒకప్పుడు కళ్యాణ్ బాబు హయాంలో ఆ ఇల్లు ఎంతో కళకళలాడుతూ ఉండేది. కానీ ఇప్పుడు లోపల జరుగుతున్నది మాత్రం వేరు.
హాల్ లో పెద్ద పార్టీ నడుస్తోంది. ఖరీదైన విదేశీ మద్యం ఏరులై పారుతోంది. పెద్ద పెద్ద మ్యూజిక్ సౌండ్స్ వస్తున్నాయి. ఒక సోఫాలో వీర్ మత్తులో తూలుతూ కూర్చుని ఉన్నాడు. అతని చుట్టూ ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళతో అసభ్యంగా ప్రవర్తిస్తూ, పేకాట ఆడుతున్నాడు.
ఆ హాల్ లోని ఒక మూల నిలబడి ఇదంతా చూస్తున్న పాత పనివాళ్లు కుమిలిపోతున్నారు.
"చూశావా రామయ్య... మన కళ్యాణ్ బాబు గారి అబ్బాయి వీర్ బాబు ఎలా తయారయ్యాడో. ఆ మహారాజు లాంటి తండ్రికి పుట్టిన బిడ్డ... ఇలా తాగుబోతులా, వ్యసనపరుడిలా మారిపోయాడేంటి?" అని బాధగా అన్నాడు ఒక పెద్దాయన.
"అంతా ఆ రాక్షసి చలవేనయ్యా... ఆ భవాని ఈ ఇంటికి అడుగుపెట్టినప్పటి నుంచి ఈ కుటుంబానికి శని పట్టుకుంది. ఆవిడ ఆడుతున్న నాటకాల్లో పడి, ఈ వీరు బాబు ఇలా నాశనమైపోతున్నాడు," అని కన్నీళ్లు పెట్టుకున్నాడు రామయ్య.
ఇంతలో వీర్ కి మందు అయిపోవడంతో, గ్లాస్ విసిరికొట్టి, "ఏయ్! ఇంకో బాటిల్ తీసుకురండిరా," అని అరిచాడు.
రామయ్య పరుగెత్తుకుంటూ వెళ్లి, వీర్ చేతులు పట్టుకుని, "ఏంటయ్యా వీర్ బాబు... ఇంకా ఎంత తాగుతావు తండ్రీ? రాత్రి నుంచి తాగుతూనే ఉన్నావు, ఇక ఆపు బాబు. నీ ఒంట్లో ప్రాణం ఏమవుతుందో అని భయంగా ఉంది. మీ నాన్నగారు ఉండి ఉంటే..." అని ఆపబోయాడు.
వీర్ కోపంగా రామయ్యను వెనక్కి గట్టిగా తోసేశాడు. రామయ్య కింద పడిపోయాడు.
"ఏయ్! నీ పని నువ్వు చూసుకో. నాకెంత తాగాలో నువ్వు చెప్తావా? ఇది నా ఆస్తి... నేనేమైనా చేసుకుంటాను. నన్ను ఆపడానికి నువ్వెవడివి? మర్యాదగా ఇక్కడినుంచి వెళ్లిపో!" అని మత్తులో కళ్లు ఎర్రజేసి అరిచాడు వీర్.
అప్పుడే పై ఫ్లోర్ నుంచి మెట్లు దిగుతూ వచ్చింది భవాని. ఆమె ముఖంలో ఒక అమాయకమైన, తీయటి నవ్వు ఉంది.
"ఏంటి బాబు వీరు... ఆ పనివాళ్ల మీద అలా అరుస్తున్నావు? వాళ్లు మన ఇంట్లో ఎప్పటినుంచో ఉన్నవాళ్లు కదా. మీ నాన్నగారు ఏనాడూ వాళ్ల మీద పల్లెత్తి మాట అనేవారు కాదు తెలుసా? నువ్వు చేసేది తప్పు బాబు, కాస్త నెమ్మదిగా ఉండు," అంటూ చాలా ప్రేమగా, జాలిగా నటిస్తూ చెప్పింది భవాని.
వీర్ ఆమె వైపు కోపంగా చూసి, "నాకు ఎవరూ నీతులు చెప్పక్కర్లేదు అత్తయ్యా! నేను ఎలా ఉండాలో, నా ఆస్తిని ఎలా వాడుకోవాలో నాకు బాగా తెలుసు. నా ఇష్టానికి అడ్డు రాకండి," అని మొహం మీదే చెప్పేశాడు.
భవాని ముఖం చిన్నబుచ్చుకున్నట్లుగా పెట్టి అక్కడినుంచి పక్కకు వచ్చేసింది.
కానీ పక్కకు రాగానే ఆమె ముఖంలో ఆ అమాయకత్వం పోయి, ఒక క్రూరమైన నవ్వు వెలిసింది. అప్పుడే ఆమె భర్త ఆమె దగ్గరికి వచ్చాడు.
"భలే సెట్ చేశావే భవాని... వీడి వ్యవహారం చూస్తుంటే మనకి పని సులువైపోయేలా ఉంది. వాడు నీ మాట కూడా వినకుండా ఇలా తాగి తాగి చస్తాడులే. వాడి కాలేయం పాడైపోయి వాడే పైకి పోతాడు. ఈ జమీందార్ ఆస్తి మొత్తం ఇక మనదే," అని మెల్లగా గుసగుసలాడాడు.
"అలాగే జరగాలి. ఆ కళ్యాణ్ గాడు ఆ రోజు నా కాళ్ల మీద పడి బతిమాలుకున్నా నేను కనికరించలేదు. ఇప్పుడు వాడి కొడుకు నా చేతుల్లో ఒక ఆటబొమ్మ," అంది భవాని పగతో రగిలిపోతూ.
మరోవైపు సోఫాలో ఉన్న వీర్, తన పక్కన ఉన్న ఒక అమ్మాయి నడుము పట్టుకుని గట్టిగా తన వైపుకి లాక్కున్నాడు. "నువ్వు రావే నా రంభ... ఈ రోజు రాత్రి నీతోనే గడుపుతాను. ఈ వీర్ అంటే ఏంటో నీకు చూపిస్తా!" అంటూ చాలా అసభ్యంగా ఆమెతో బిహేవ్ చేస్తూ, ఆమెను ఎత్తుకుని తన బెడ్ రూమ్ వైపు నడిచాడు.
గదిలోకి వెళ్లగానే తలుపులు గట్టిగా వేసుకున్నాడు. కొద్దిసేపటికే ఆ గదిలోంచి అరుపులు, ముద్దుల శబ్దాలు బయటకి వినిపించడం మొదలయ్యాయి.
అది వింటున్న పనివాళ్లందరూ తలలు పట్టుకున్నారు. "ఏం కర్మ పట్టిందిరా దేవుడా మనకి... ఆ ఇంటి వారసుడిని ఇలాంటి నీచమైన స్థితిలో చూడాల్సి వస్తోంది," అని వాళ్ళు కుమిలిపోతుంటే... బాల్కనీలో నిలబడిన భవాని మాత్రం ఆ దృశ్యాన్ని చూసి ఎంతో ఆనందంతో చిరునవ్వు చిందిస్తోంది.
రాజ్వీర్ తన స్టడీ రూమ్ లో కూర్చుని ఏదో ఫైల్ సీరియస్ గా చూస్తున్నాడు. అప్పుడే విక్రమ్ వేగంగా లోపలికి వచ్చాడు.
"బాస్... మీరు చెప్పిన ఆ పెద్దవిడ మాకు దొరికింది," అన్నాడు.
రాజ్వీర్ కళ్ళలో ఒక మెరుపు. "అవునా! ఎక్కడుంది?" అని వెంటనే అడిగాడు.
"మేము ఆవిడని కింద గదిలో పడుకోబెట్టాం బాస్. మీరు వచ్చి చూస్తారా?" అని అడిగాడు విక్రమ్.
రాజ్వీర్ "వస్తున్నాను," అని చెప్పి తన చేతిలో ఉన్న ఫైల్ ని బల్ల మీద పక్కకు విసిరేసి, వేగంగా అక్కడి నుంచి బయలుదేరి ఆ గదిలోకి వచ్చాడు.
గదిలో మంచం మీద అపస్మారక స్థితిలో ఒక నలభై ఏళ్ల మహిళ పడుకుని ఉంది. ఒంటి మీద ఉన్న బట్టలు చిరిగిపోయి ఉన్నాయి. ముఖం అంతా ముడతలు పడి, ఎన్నో ఏళ్ల చిత్రహింసలను మోస్తున్నట్లుగా ఉంది. ఆవిడని చూడగానే రాజ్వీర్ కళ్లలో ఒక వింతైన బాధ, ఒక తెలియని ఎమోషన్ కనిపించాయి. ఎప్పుడూ రాతిలా, చాలా కోల్డ్ గా ఉండే తమ బాస్ కళ్లలో ఆ ఫీలింగ్ చూసి విక్రమ్ కి మైండ్ బ్లాక్ అయింది. 'ఏంటి... బాస్ కళ్లలో బాధా? అసలు ఈవిడ ఎవరు?' అని మనసులో షాక్ అయ్యాడు.
"బాస్... ఆవిడని చాలా దారుణంగా హింసించారు. ఆవిడ చాలా పెద్ద షాక్ లో ఉన్నారు. మనం వెంటనే ట్రీట్మెంట్ ఇప్పిస్తేనే ఈవిడ కోలుకుంటారు," అని విక్రమ్ కాస్త సీరియస్ గా చెప్పాడు.
"మరి ఇంకెందుకు ఆలస్యం?" అని గద్దించాడు రాజ్వీర్.
"నేను ఆల్రెడీ అన్నీ సెట్ చేశాను బాస్, డాక్టర్స్ కూడా వస్తున్నారు," అన్నాడు విక్రమ్.
"ఆవిడ కోలుకోవడానికి ఎన్ని నెలలు పడుతుంది?" అని అడిగాడు రాజ్వీర్.
విక్రమ్ కొద్దిగా ఆలోచించి, "ఆవిడ ఉన్న ట్రామా చూస్తుంటే... క్యూర్ అవ్వడానికి మినిమం మూడు నెలలు పట్టొచ్చు ఏమో సార్," అని సమాధానం ఇచ్చాడు.
"సరే, వీలైనంత తొందరగా క్యూర్ చేయడానికి చూడు," అని చెప్పాడు రాజ్వీర్.
ఆ తర్వాత రాజ్వీర్ నెమ్మదిగా మంచం దగ్గరికి వెళ్ళాడు. స్పృహలో లేని ఆవిడ రెండు చేతులను తన చేతుల్లోకి తీసుకున్నాడు. అతని గొంతులో ఒక సన్నటి ఆర్తనాదం.
"నన్ను క్షమించు అత్తయ్యా... నిన్ను ఇంత లేటుగా వెతికి పట్టుకున్నందుకు! నేను ఇంకా అందర్నీ వెతుకుతున్నాను. మన కుటుంబాన్ని ఇలా చిందరవందర చేసిన వాళ్లని... ఒక్కొక్కరిని ఏరిపారేస్తాను, ఎవరినీ వదలను!" అని కసిగా, కోపంగా అన్నాడు.
ఆ తర్వాత విక్రమ్ వైపు తిరిగి, "ఆవిడని చాలా జాగ్రత్తగా చూసుకోండి," అని తన రెగ్యులర్ కోల్డ్ వాయిస్ లో ఆర్డర్ వేసి, అక్కడి నుంచి మళ్లీ తన స్టడీ రూమ్ లోకి వెళ్లిపోయాడు. మిగతా వాళ్లందరినీ ఎలా వెతకాలి అన్న ఒక తీవ్రమైన ఆలోచనలో పడిపోయాడు రాజ్వీర్.
రాత్రి పది గంటలవుతోంది.
Comments